Struggle లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Struggle లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

05/07/2025

2025 జూలై 9 దేశవ్యాప్త సమ్మె డిమాండ్లు

G. Ashok

 

2025 జూలై 9 దేశవ్యాప్త సమ్మె డిమాండ్ల

1.     నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి.

2.    పని హక్కు ప్రాథమిక హక్కుగా గుర్తించాలి. సమాన పనికి - సమాన వేతనం అమలు చేయాలి. కనీస వేతనం నెలకు రూ.26,000/- లుగా నిర్ణయించాలి.

3.    ఔట్ సోర్స్, ఫిక్స్ టర్మ్ ఎంప్లాయ్ మెంట్, అప్రెంటిస్లు, ట్రైనీలు వంటి రూపాలలో వివిధ పథకాల క్రింద పనిచేస్తున్న కార్మికులు ఎవరినీ క్యాజువలైస్ చేయరాదు.

4.    ఈపిఎస్ మరియు ఇతర ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉద్యోగ విరమణ చేసిన వారందరికి కనీస పెన్షన్ నెలకు రు. 13,000లు ఇవ్వాలి. దానికి ఎప్పటికప్పుడు కరువు భత్యం జోడించాలి.  అసంఘటిత కార్మికులు మరియు వ్యవసాయ కార్మికులతో సహా అన్ని తరగతుల కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలి. పెన్షన్తో సహా సమగ్ర సామాజిక భద్రతలో అందరినీ భాగస్వాములను చేయాలి.

5.    పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలి. సిఎన్ఎస్ మరియు యుపిఎస్ ను రద్దు చేయాలి. పెన్షన్ సవరణ చట్టం 2025ని రద్దు చేయాలి.

6.    ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇప్పటికే వర్తిస్తున్న ఆరోగ్య సదుపాయాలను కుదించకుండా అవసరమైన మేరకు మెరుగ్గా చేయాలి.

7.     దరఖాస్తు పెట్టినప్పటి నుండి 45 రోజుల వ్యవధిలో కార్మిక సంఘాల తప్పనిసరి రిజిస్టర్ చేయబడాలి. ILO సమావేశాలు C87 మరియు C98 లను తక్షణమే ఆమోదించాలి.

8.    ధరల పెరుగుదలను నియంత్రించాలి. ఆహారం, మందులు, వ్యవసాయ- పనిముట్లు, ఎరువులు మరియు యంత్రాలు వంటి ముఖ్యమైన వస్తువులపై జీఎస్టీని తొలగించాలి. పెట్రోలియం ఉత్పత్తులు మరియు వంట గ్యాస్ పై సెంట్రల్ ఎక్సైజ్ పన్నును గణనీయంగా తగ్గించాలి. ఆహార భద్రత చట్టానికి హామీ ఇవ్వాలి. ప్రజా పంపిణీ వ్యవస్థను సార్వత్రికం చేయాలి.

9.    ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ విభాగాల ప్రైవేటీకరణను ఆపాలి. నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ (MP) ను వెనక్కితీసుకోవాలి.

10. అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర @C-2+50% నిర్ధారించాలి. చట్టపరమైన హామీ ఇవ్వాలి. విత్తనం, ఎరువులు మరియు విద్యుత్ మొదలైన వాటిపై రైతులకు ఇన్పుట్ సబ్సిడీని పెంచాలి.

11.  విద్యుత్ (సవరణ) బిల్లు 2022ను ఉపసంహరించుకోవాలి. విద్యుత్ ప్రైవేటీకరణను ఆపాలి. ప్రీ-పెయిడ్ స్మార్ట్ మీటర్లు పెట్టకూడదు.

12. ఉచిత విద్యా హక్కు, ఉచిత ఆరోగ్య హక్కు, నీరు మరియు అందరికీ పారిశుధ్యం అందుబాటులోకి తేవాలి. నూతన విద్యా విధానం (NEP) 2020ను రద్దు చేయాలి. అందరికీ గృహనిర్మాణం అమలు చేయాలి.

13. అటవీ హక్కుల చట్టాన్ని (FRA) కఠినంగా అమలు చేయాలి.

14. వెల్ఫేర్ ఫండ్ లోకి వచ్చిన చందా నిధులతో నిర్మాణ కార్మికులకు ESI కవరేజ్ ఇవ్వాలి. ఆరోగ్య పథకాలకు కవరేజ్, ప్రసూతి ప్రయోజనం, ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకున్న కార్మికులందరికీ జీవిత మరియు వైకల్యం బీమా ఇవ్వాలి.

15. అత్యధిక సంపన్నుల పైన, కార్పొరేట్లపైన విధిస్తున్న పన్నును పెంచాలి. సంపద పన్ను మరియు వారసత్వ పన్నును తిరిగి ప్రవేశపెట్టాలి.

16.      భావ ప్రకటనా స్వేచ్ఛ, అసమ్మతి హక్కు, మత స్వేచ్ఛ, విభిన్న సంస్కృతులు, భాషలు, చట్టం ముందు సమానత్వం మరియు దేశ సమాఖ్య నిర్మాణం మొదలైన రాజ్యాంగ ప్రాధమిక విలువలైన దాడిని ఆపాలి.

జి. అశోక్ 9490300725

04/07/2025

కార్మికులకు మరణశాసనం లేబర్‌కోడ్స్‌

G. Ashok

                                         కార్మికులకు మరణశాసనం లేబర్‌కోడ్స్‌


1991లో వచ్చిన సరళీకృత ఆర్థిక విధానాలు, కేంద్ర ప్రభుత్వ కార్మికుల వ్యతిరేక వైఖరి, ప్రయివేటీకరణ పోకడల్ని నిరసిస్తూ, కార్మిక హక్కుల్ని కాపాడటం కోసం పది కేంద్ర కార్మిక సంఘాలు నాటి నుండి నేటి వరకు దేశవ్యాప్తంగా 21 సమ్మెలు నిర్వహించాయి. ప్రధాన రంగాల ప్రయివేటీకరణ, విదేశీ పెట్టుబడి ఆహ్వానాన్ని వ్యతిరేకిస్తూ మొదటి దేశవ్యాప్త సమ్మె 29 నవంబర్‌ 1991లో మొదలైంది. కార్మికులకు అధిక వేతనాలు, సామాజిక భద్రత కల్పించడం, కార్మిక చట్టాల్లో సంస్క రణలకు వ్యతిరేకంగా జరిగిన దేశవ్యాప్త సమ్మెల్లో కార్మికులు ప్రతియేటా పాల్గొంటు న్నారు.


అంతేకాక ఉద్యోగ భద్రత, పెన్షన్‌ హక్కును డిమాండ్‌ చేస్తూ కార్మికులు సమ్మెలు నిర్వహిస్తున్నారు. 2020 నవంబర్‌ 26న జరిగిన దేశవ్యాప్త సమ్మెలో 25 కోట్ల మంది అనగా 250 మిలియన్ల కార్మికులు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సమ్మె ద్వారా తమ నిరసన తెలియజేశారు. ఇది ప్రపంచంలో జరిగిన అతిపెద్ద సమ్మెల్లో ఒకటని జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలు అభివర్ణించాయి. 2019 జనవరి 8-9 తేదీల్లో జరిగిన రెండు రోజుల సమ్మె, 2022 మార్చి 28-29 తేదీల్లో జరిగిన సమ్మెలు, బ్యాంకింగ్‌, రవాణా, ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రభావితం చేశాయి. కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక కార్మికుల హక్కుల కోసం పోరాడే శక్తివంతమైన వేదికగా నిలుస్తున్నది. జులై 9న నిర్వహించే దేశవ్యాప్త సమ్మె కూడా అందులో భాగం కానుంది.



ప్రస్తుతం మోడీ నేతత్వంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులను బానిసత్వంలోకి నెట్టి వేసే లక్ష్యంతో 29 కార్మిక చట్టాల్ని రద్దు చేసి, వాటిస్థానంలో నాలుగు లేబర్‌ కోడ్స్‌ను అమలు చేసేందుకు అడుగులు వేస్తున్నది. ఫ్యాక్టరీల్లో, పని ప్రదేశంలో యూనియన్లు లేకుండా చేయటమే లక్ష్యంగా, కార్మికవర్గాన్ని నిరాయుధుల్ని చేయడమే ధ్యేయంగా ఈ లేబర్‌ కోడ్స్‌ అని స్పష్టమవుతున్నది. 2002లో అప్పటి వాజ్‌పారు ప్రభుత్వం 2వ లేబర్‌ కమిషన్‌ను రవీంద్రవర్మ నేతృత్వంలో నియమించి 44 కార్మిక చట్టాల స్థానంలో లేబర్‌ కోడ్స్‌ను తీసుకురావాలని ప్రతిపాదించింది. ప్రస్తుత మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక, చట్టవిరుద్ధ విధానాలు దాదాపు అన్ని కూడా 2వ లేబర్‌ కమిషన్‌ సిఫార్సులను పోలి ఉండటాన్ని గమనిస్తే అప్పటినుండి యజమానులకు అనుకూలంగా, కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాయ పూనుకున్నదన్న విషయం అవగతమవుతున్నది.


2005లో అప్పటి యూపీఏ ప్రభుత్వానికి వామపక్ష పార్టీల సహకారం ఉండటం వల్లన లేబర్‌కోడ్స్‌ను తీసుకురావడానికి వెనుకడుగు వేసింది. 2014లో తిరిగి అధికారంలోకి వచ్చిన బీజేపీ నాలుగు లేబర్‌ కోడ్స్‌ను తీసుకొచ్చి వాటి ప్రక్రియను ప్రారంభించింది. కార్మిక సంఘాల సమ్మెలు, పోరాటాల వలన వెంటనే అమలు చేయడానికి ప్రభుత్వానికి సాధ్యం కాలేదు. 2019లో మూడోసారి అధి కారం చేపట్టిన తర్వాత పార్లమెంట్‌లో వేతనాల కోడ్‌ను పాస్‌ చేయించుకుంది. 2020లో మిగిలిన మూడు పారిశ్రామిక సంబం ధాల కోడ్‌, సామాజిక భద్రత కోడ్‌, వత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్స్‌ను ఆమోదించుకుంది. మూడు వ్యవ సాయ నల్లచట్టాలు పార్లమెంటులో ప్రవేశపెట్టగా అప్పటి ప్రతిపక్ష పార్టీల పార్లమెంట్‌ సభ్యులు వాటికి నిరసనగా వాకౌట్‌ చేసిన సమయంలో ఈ లేబర్‌ కోడ్స్‌ను దొడ్దిదారిలో ఆమోదింపజేసుకుంది.



ఈ లేబర్‌కోడ్స్‌ను సరిగ్గా పరిశీలిస్తే కార్మిక వర్గంపై ప్రత్యక్ష దాడిచేసి వారి హక్కుల్ని హరించేందుకు ఉద్దేశించిన విధంగా ఇవి రూపొందించబడ్డాయి. దేశ సహజ వనరులను, ప్రజలను దోచుకోవడానికి, కార్పొరేట్‌ యాజమా న్యాలకు లాభాలు కట్టబెట్టడానికి, కార్మికులను మరింత దోపిడీ చేసేలా ఉన్నాయి. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన కార్మికులు, సంఘాలు కార్మికులతో కలిసి నిరంతర పోరాటాలు, ఆందోళనలు, ప్రతిఘటనలు చేయడం వల్ల ఈ నాలుగేండ్ల నుంచి ఈ లేబర్‌కోడ్స్‌ని అమలు చేయటంలో కేంద్రం కాస్తా వెనుక్కు తగ్గింది. అయితే 2025లో ఈ లేబర్‌ కోడ్స్‌ను ఎలాగైనా అమలు చేయలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. ఇప్పటికే మోడీ ప్రభుత్వం ”జన విశ్వాస్‌” అనే చట్టంలోని నిబంధనల ప్రకారం అనేక చట్టాల కింద కార్పొరేట్లకు సంబంధించి 180 నేరాలను నేరరహితం చేసింది. ఈ చట్టాలను ఉల్లంఘించినందుకు యజమానులకు జైలు శిక్షలు విధించే నిబంధనలను ఈ లేబర్‌ కోడ్స్‌లో ఉపసంహరించింది. 2025 కేంద్ర బడ్జెట్‌లో కూడా మరో 100 నేరాలను నేర రహితం చేసింది. ”శ్రమ సమాధాన్‌”, ”శ్రమ సువిధ పోర్టల్‌”లు యజమానులు కార్మిక చట్ట ఉల్లంఘనలను సులభతరం చేయడానికి, ఫిర్యాదు ఆధారిత తనిఖీలను ఈ లేబర్‌ కోడ్స్‌ ద్వారా రద్దు చేసింది.



మరోవైపు కార్మికులు పోరాడి సంపాదించు కున్న హక్కులను కాలరాస్తూ సమిష్టి బేరసారాల చర్యలను లేబర్‌కోడ్స్‌ తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నది. కార్మికులు వారి సంఘాలు సమిష్టిగా ఫిర్యాదు చేయడం లాంటి వాటిని వ్యవస్థీకృత నేరంగా పరిగణించాలని పేర్కొంటు న్నది. ఫలితంగా నాన్‌ బెయిలబుల్‌ శిక్షలతో సహా పోలీసు చర్యలకు దారి తీసే ప్రమాదం కూడా ఉంది. ఈ లేబర్‌ కోడ్స్‌ అమలు చేయడానికి ముందుగానే గేట్‌ మీటింగులు, డిపార్ట్‌మెంటల్‌ సమావేశాలు, కరపత్రాల పంపిణీ, మెమొరాం డాలు అందజేయటం లాంటి ట్రేడ్‌ యూనియన్‌ కార్యకలాపాలను, హక్కులను ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో, సంస్థల్లో ఇప్పటికే నిషేధించింది. ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ఉపాధిని తీసుకురావడం ద్వారా ఉద్యోగ భద్రతతో పాటు అనేక సౌకర్యాలు అందచేయకుండా చూడటమే దీని ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తున్నది. శాశ్వత ఉద్యోగి, ఉపాధి అనేది ఒకప్పటి విషయం.


ప్రస్తుతం ఔట్‌సోర్సింగ్‌, అప్రెంటీస్‌లు, ఇంటర్న్‌షిప్‌లు మొదలైన విధానాల ద్వారా కార్మికులను కేంద్రం నియమిస్తున్నది. అంతేకాక ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ, గ్రాట్యూటీ సౌకర్యాలను కూడా కార్మికులకు దూరం చేసే రూల్స్‌ను ఈ లేబర్‌కోడ్స్‌లో పొందుపరిచింది. ఇది ట్రేడ్‌ యూనియన్‌లను బలహీనపరచడానికి, యూనియన్లను తొలగించడానికే అనేది స్పష్టమవుతున్నది.దీనిద్వారా కార్మికుల్లో ఒక భయానక వాతావరణాన్ని సష్టించే పథకం చాపకింద నీరులా మోడీ సర్కార్‌ అనుసరిస్తున్నది.

లేబర్‌ కోడ్స్‌ అమలు అంటే మొత్తం పరిపాలనలో కార్పొరేట్‌ పెట్టుబడిదారీ వర్గం విధానాల అమలుకు ఎలాంటి అడ్డం కులు లేకుండా కొనసాగించుకోవడానికి, యథేచ్ఛగా లాభాలు ఆర్జించటానికేనన్నది స్పష్టమవుతున్నది. యూనియన్ల రహిత పని ప్రదేశాల ఏర్పాటు, కార్మికుల సమిష్టి చర్యలను నిర్వీర్యం చేసి వారిని నిరాయుధులను చేయడమే ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తున్నది.



కార్మికుల హక్కుల్ని కాలరాసే మరణ శాసనాలుగా ఈ లేబర్‌కోడ్స్‌ పనిచేయ నున్నవి. అందుకే ఈనెల 9న జరగబోయే దేశవ్యాప్త సమ్మెను గతంలో నిర్వహించిన సమ్మెల్లో ఒకటిగా చూడకూడదు. లేబర్‌ కోడ్స్‌ అమలును తీవ్రంగా తిప్పికొట్టడానికి ప్రతిఘటనా, పోరాటాల ప్రారం భంగా ఈ సమ్మెను చూడాలి. పెట్టుబడి దారీ విధానాన్ని తరిమేయడంలో కార్మిక వర్గం మరింత మెలకువతో ముందుండాలి. నయా ఉదార వాదానికి వ్యతిరేకంగా, ఐక్యపోరాటాలను మరింత ఉన్నతస్థాయికి తీసుకుని వెళ్లాలి. ఈ సమ్మె రెండవ దశ పోరాటానికి ప్రారంభం మాత్రమేనని దేశ ప్రజానీకానికి తెలియజేయాలి.



****

ఎస్‌ఎస్‌ఆర్‌ఎ ప్రసాద్‌ 9490300867


18/08/2023

సమకాలీన సమాజం లో సర్వాయి పాపన్న ప్రాసంగికత

G. Ashok

 సమకాలీన సమాజం లో సర్వాయి పాపన్న ప్రాసంగికత

( సర్వాయి పాపన్న జయంతి 18 ఆగస్ట్ సందర్భంగా) 


వీరగోని పెంటయ్య.


    చక్కని మైదాన ప్రాంతం ,సారవంతమైన నేల , గోదావరి,కృష్ణ ,తుంగభద్ర వంటి జీవ నదులు,  పచ్చని పంటపొలాలతో పరిఢ విల్లుతున్నదక్కన్ పీఠ  భూమి పైన కన్ను బడ్డ మొఘల్ చక్రవర్తి ఔరంగజీబు  క్రీ. శ. 1687 లో గోల్కొండపై దాడి చేసి,  కుతుబ్ షాహీ చివరి చక్రవర్తి అబుల్ హాసన్ అలియాస్ తానేశా ను బంధిస్తాడు. గోల్కొండ రాజ్యం 21 సుబా లు కలిగి 455 పరగణాలతో సువిశాల సామ్రాజ్యం.ఇంతటి సౌభాగ్య గడ్డను  ఔరంగజీబ్ కు నమ్మిన బంటు అయిన  జాన్ సఫార్ ఖాన్ను గోల్కొండ గవర్నర్ గా నియమించి ఆయన డిల్లీ పాలనాభారం వహించడానికి వెళ్ళిపోతాడు.

జాన్ సఫార్ ఖాన్ దక్కన్ కు కొత్తవాడు. సువిశాలమైన సుభాల వ్యవహారం అర్థం చేసుకొనే  సమయం లోనే  కక్కుర్తి పరులైన కొందరు  సుభేదార్లు  తమ సుబాలను మరింత విస్తరించుకొనే ఆపేక్షలో బడి  ఒకరి పై ఒకరు సాయధా దాడులకు పూనుకుంటారు. సైన్యం రహదారుల వెంట కవాతు చేస్తూ సుభాల సరిహద్దులను అతిక్రమిస్తుంటాయి. ఆ క్రమం లో పల్లెల్లోని బలహీన వర్గాల ప్రజల పైన ,ఆస్తుల పైన సైనిక దాడులు జరుగుతుంటాయి.ఘనపూర్ సుబాహ షాపురం గ్రామం లోని సామాన్య  గీతకార్మిక కుటుంబానికి చెందిన సర్వాయి పాపన్న కుటుంబం పైన కూడా  సైనిక దాడి జరుగుతుంది. ఇదెక్కడి అన్యాయం ఆని ప్రశ్నించిన నేరానికి పాపన్న పైనకూడ దాడి జరుగుతుంది. 


క్రీ. శ. 1650 లో పుట్టిన సర్వాయి పాపన్న వయసు ఆనాటికి 37 సంవత్సరాలు. అప్పటికే దేశ వ్యాప్తంగా జరుగుతున్న సూర్ దాస్, సంత్ రవిదాస్, మీరాబాయి, సూర్ దాస్, తులిసీ దాస్, కబీర్, రాందాస్, గురు తేజబహదూర్, గురు గోవింద్ సింగ్, గురునానక్, బసవేశ్వర్, వేమన,   లాంటి వారి  భక్తి,,  భావజాల  ఉద్యమాల , పాటల జాతరలు మండువల్లో మారుమోగుతుండిన  ఫలితంగా నాటి ధిక్కార భావజాలం పాపన్నను ప్రభావితం చేసి ఉంటుంది. 


అధికారం, ఆధిపత్యానికి కేంద్రాలు, ఆనాటి గడీల వ్యవస్థ అనీ, వాటికి వెన్నుదన్నుగా ఉన్నది గోల్కొండ రాజ్యాధికారం అనీ, ప్రౌఢ ప్రాయంలో ఉన్న పాపన్నకు సులభంగానే అర్థం అయింది. మరి తమలో ఉన్న, బానిస  దాస భావజాలానికి  మూలాలు ఎక్కడ ఆని ఆలోచించిన పుడు అవి “ కులం” లో ఉన్న విషయాన్ని అర్థం జేసుకున్నాడు. ఈ కులాల పుట్టుకకు కేంద్రం మతం అన్న విషయం ఆయన మండువల్లో విన్న బోధనలు అర్థం చేయించాయి. అందుకని కులాలను ఏకం చేయకుండా, మత సామరస్యాన్ని సాధించకుండా తమ పైన జరుగుతున్న ఆధిపత్యాన్ని అణిచివేతను ఎదుర్కోవడం సాధ్యం కాదన్న విషయం పాపన్న కు అర్థం అయింది.


అందుకే కుమ్మరి గోవిందు, జక్కుల పెరుమాండ్లు , మంగలి మాసన్న, చాకలి సరవన్న, దూదేకుల పీర్ సాహెబ్, హాసన్, హుసేన్, తురక హిమాం, కొత్వాల్ మీర్ సాహెబ్, పుర్ దిల్ ఖాన్, హనుమంతు, మేదరి ఎంకన్న, ఎరుకలి సిట్టెలు, ఏనాది పాసెలు వంటి 20,000 మంది సైనిక శక్తిని సర్వాయి పాపన్న సమకూర్చుకున్నాడు. (Source; A  social History Of Daccan. Cambridge Histories.  Cambridge University Press.) 



చాకలి, మంగలి, కుమ్మరి, బుట్టలు అల్లే వారు, దళితులు(జక్కుల) మహ్మదీయులు, దూదేకుల, ఇట్లా వివిధ కులాల మతాల వారి ఐక్య సంఘటన ద్వారా 17 వ శతాబ్దం లోనే 20,000 మంది సైన్యాన్ని కూడగట్టి ఆనాటి భారత సామ్రాజ్యవాద మొఘల్ చక్రవర్తులను గెలిచిన చరిత్ర మన కండ్ల  ముందు కనబడుతోంది. 


ఈనాడు అందరు కులాలు పోవాలి అంటున్నారు. కానీ కుల సంఘాలు బలపడాడానికి ఎవరివంతు కృషి వారు చేస్తున్నారు.  మనుషుల మధ్య ఉండవలిసిన సోదర స్వభావాన్ని కులం ధ్వంసం చేస్తుంది. అణగారిన కులాలు ఎక్కడో ఒకచోట నిత్యం అవమానాలకు గురవుతూనే ఉంటారు. మరో చోట ఏదో ఓ కులం తాము అధికులమని సంతృప్తి పొందుతూ ఉంటుంది. శారీరక శ్రమ అల్పం, బౌద్ధిక శ్రమ అధికం అనే భావజాల ఫలితమే, ఎక్కువ, తక్కువ  కులాల  లోని సారం అని పాపన్న అర్థం చేసుకున్నాడు. బుద్ధితో ఆలోచించి గురిచూసి చేతులతో బరువైన తుపాకిని ఎత్తి కాల్చితేనే దోపిడిని నిలువరించగలమని, బౌద్ధిక శ్రమ, భౌతిక శ్రమ రెండింటి మేలు కలయికనే మనిషి పురోగామికి మార్గదర్శనం ఆని పాపన్న ఆనాడే అర్థం చేసుకున్నాడు.


మతాల మధ్య విద్వేషాలు మనుషులకు కీడుచేస్తాయే కానీ మేలు చేయవని 370 ఏండ్ల కిందటనే ఆనాడు పాపన్న అర్థం చేసుకోని కులేతరులతో, మతేతరులతో సమూహం కడితే, ఇప్పుడు .మనమేమో మన మతం కానివాడితో ప్రమాదం ఆని పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నాము. మన కులం కానీ వారితో పెళ్ళిళ్ళు జరిగితే చంపివేస్తున్నాము. అన్ని రాజకీయ పార్టీలు గీతకార్మికుల ఓట్ల కోసం ఇవ్వాల సర్వాయి పాపన్నను భుజానికి ఎత్తుకుంటున్నాయి. కానీ ఆయన భావజాలాన్ని కదా ప్రచారం చేయవల్సింది. ఏమిటి ఆయన భావజాలం? ఏమిటి ఆయన తాత్వికత?  ఎక్కడైనా, ఎప్పుడైనా  బలహీనుడిని  బలవంతుడు పీడిస్తే, దోచుకొంటే అక్కడ పాపన్న ప్రత్యక్షమై బలహీనుల పక్షాన నిలబడ్డాడు. ప్రతి మనిషికి పాలకులు ఏవైతే  సౌకర్యాలు పొందుతున్నారో అవే సౌకర్యాలు  సామాన్య ప్రజలందరికీ  దక్కాలని కదా పాపన్న గడీలల్లో పోగుబడ్డ సంపదను ప్రజలకు పంచి పెట్టింది? ఇవి కదా పాపన్న గురించి మాట్లాడుకోవాల్సింది? ఆయన జన్మ దిన సందర్భంగా ఆ విలువలను ఆచరణలో పెడుతామని ప్రతి పాలక వర్గ ప్రతినిధి ప్రజలకు వాగ్దానం చేయవలసి ఉంది .  ఇవి  కదా సమకాలీన సమాజానికి సర్వాయి పాపన్న ప్రాసంగికతను తెలుపవలసిన అవసరం ఉన్న అంశాలు.


1687లో మొఘలులు ఎదుర్కొన్న సంక్షోభం నుండి బైట పడేదానికి పాడి ఆవు లాంటి దక్కన్ పై దాడి జేసీ ఇక్కడి వనరులను, ఇక్కడి ప్రజలను విపరీతంగా దోపిడి జేసిన ఫలితంగా దక్కన్ లో ఒక సర్వాయి పాపన్నను కాలం కన్నది. అలాగే ప్రపంచ యుద్ధాల కాలంలో బ్రిటిష్ ప్రభుత్వం భారత గడ్డ పైన సాగించిన దోపిడి దౌర్జన్యాల ఫలితంగా భారంత స్వాతంత్రోద్యమం ఒక భగత్ సింగ్ ను కన్నది. 1970వ దశకంలో ఇందిరాగాంధీ విధించిన  ఎమర్జన్సీ  ప్రభావం ఫలితంగా ఏర్పడ్డ సంక్షోభం నుండి దేశంలో వేలాది ప్రజా ఉద్యమ కారులను కాలం కన్నది అందులో గద్దర్ లాంటి వారు ఎందరో. అలాగే విశాలాంధ్ర ఏర్పడ్డ  నుండి తెలంగా పైన ఎంతో దౌర్జన్యం దోపిడి జరిగినా చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డిల కాలంలో అది పతాకస్థాయికి  చేరి  సర్వ విధాలా దోపిడీ, పీడనలు జరిగినందున  ఒక ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉద్భవించింది. 


1687, 1920-47, 1976-77, 1980-2014 వరకు జరిగిన కాలాన్ని గమనించి నపుడు అప్పటికంటే ఇప్పుడు అభివృద్ధి పేరిట అలివిగాని వనరుల విధ్వంసం జరుగుతున్నది. ప్రజా విస్తాపనం జరుగుతున్నది. విపరీతమైన పన్నులు వేసి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్న పరిస్తితి. విద్య, వైద్యం అంగట్లో అత్యంత పిరపు సరుకులు అయినాయి.  మనుషుల మధ్యన కులాల పేరుతో మతాల పేరుతో  విద్వేషాలూ రగల్చడమే ఒక విధానంగా సాగుతున్న పరిస్థితిలో ఎందరు సర్వాయి పాపన్నలు, ఎందరు భగత్ సింగ్ లు ఎందరు గద్దర్ లు పుట్టుకు రావాల్సిన పరిస్తితి ఉంటుందో కాలమే నిర్ణయించాలి.   



వీరగోని పెంటయ్య. 

కరీంనగర్ . 9908116990






11/08/2023

ఢిల్లీలో వేలాదిమంది ఉద్యోగుల పెన్షన్ హక్కుల మహార్యాలీ

G. Ashok

 ఢిల్లీలో వేలాదిమంది ఉద్యోగుల పెన్షన్ హక్కుల మహార్యాలీ



  • ‘పాత పెన్షన్ స్కీమ్’ పునరుద్ధరించండి…

  • ఢిల్లీలో వేలాదిమంది ఉద్యోగుల పెన్షన్ హక్కుల మహార్యాలీ

  • భారత్ బంద్ సహా ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరిక

            పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన వేలాది మంది ఉద్యోగులు గురువారం 10.08.2023న, రాంలీలా మైదానంలో ‘పెన్షన్ హక్కుల మహా ర్యాలీ’ ర్యాలీ నిర్వహించారు.


ఇక్కడ క్లిక్ చేసి ర్యాలీ వీడియో చూడండి. (News Click సౌజన్యంతో)

        దాదాపు 60 సంఘాల వేదికగా జాయింట్‌ ఫోరమ్‌ ఫర్‌ రిస్టోరేషన్‌ ఆఫ్‌ ఓల్డ్‌ పెన్షన్‌ స్కీమ్‌ (జేఎఫ్‌ఆర్‌ఓపీఎస్‌) నిర్వహించిన నిరసన ర్యాలీ అనంతరం, ప్రస్తుత జాతీయ పెన్షన్‌ స్కీమ్‌ (ఎన్‌పీఎస్‌)ని జనవరి 1, 2004న లేదా ఆ తర్వాత రిక్రూట్ చేయబడిన ఉద్యోగులకు అమలు చేయడం వివక్షతో కూడుకున్నదనీ, ఇది ‘‘వాడుకుని వదిలివేయడం‘‘ వంటిదనీ ప్రధాన మంత్రి గారికి మెమోరాండం సమర్పించారు.


        OPS కింద, ఉద్యోగులు చివరిగా తీసుకున్న ప్రాథమిక వేతనంలో 50% నేరుగా పెన్షన్‌గా ఇవ్వబడిందని మరియు దానిపై ద్రవ్యోల్బణం ఆధారంగా డియర్‌నెస్ అలవెన్స్‌ను చెల్లిస్తారనీ మెమోరాండం పేర్కొంది. "NPSలో, అటువంటి నిర్వచించబడిన మరియు హామీ ఇవ్వబడిన పెన్షన్ లేదు, అది నిర్వచించబడిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ మాత్రమే. ఇది పూర్తి వివక్ష మరియు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 మరియు 16ను ఉల్లంఘించడమే అన్నారు. ఎందుకంటే నియామక తేదీ ఆధారంగా, ప్రభుత్వ ఉద్యోగులను రెండు తరగతులుగా విభజించారు, ఒక సమూహం నిర్వచించబడింది మరియు 50%కి సమానమైన పెన్షన్‌ను హామీ ఇస్తుంది. వారి చివరి వేతనం ఎటువంటి సహకారం లేకుండా తీసుకోబడింది, అయితే ఇతర సమూహం తక్కువ పెన్షన్‌ను పొందుతోంది, ఇది మార్కెట్ యొక్క మార్పులపై ఆధారపడి ఉంటుంది కాబట్టి అందరికీ ”ఓపిఎస్‌ను పునరుద్ధరించడానికి జోక్యం చేసుకోవాలని మోదీని మెమోరాండం కోరింది.



‘పెన్షన్ హక్కుల మహా ర్యాలీ’లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఆఫీసర్లు, ఉపాధ్యాయులు, మాజీ పారా మిలటరీ ఉద్యోగులు, పెన్షనర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంలీలా మైదానంలో ఎన్.జె.సి.ఏ కన్వీనర్ శివగోపాల్ మిశ్రా అధ్యక్షతన బహిరంగసభ జరిపారు. జాయింట్ ఫోరం ఫర్ రెస్టోరేషన్ ఆఫ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (జేఎఫ్ఆర్ఓపీఎస్) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరిగిన ప్రదర్శనలు, ర్యాలీలలో లక్షలాది మంది రైల్వే, డిఫెన్స్, పోస్టల్, ఇన్కమ్ టాక్స్ తదితర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఆఫీసర్లు, రాష్ట్ర ప్రభుత్వ, స్వయంప్రతిపత్త సంస్థల ఉద్యోగులు, టీచర్లు, యూనివర్సిటీల సిబ్బంది, పెన్షనర్లు పాల్గొని న్యూ పెన్షన్ స్కీము(సిపియస్)ను రద్దు చేయాలని నినదించారు. ఎన్పీఎస్ కారణంగా ఉద్యోగుల భవిష్యత్తు అనిశ్చితంగా మారినందు వల్ల ఓపీఎస్‌ ను పునరుద్ధరించమనడం న్యాయబద్ధమైన కోర్కె తెలంగాణ ఆల్ పెన్షనర్స్ మరియు రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి గడ్డం అశోక్ ఈ సందర్భంగా తెలిపారు.


        సి.ఆర్.పి.ఎఫ్, సి.ఐ.ఎస్.ఎఫ్, ఐ.టి.బి.పి, యస్.యస్.బి, ఎన్.ఎస్.జి, అస్సాం రైఫిల్స్, తదితర సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (సి.ఎ.పి.ఎఫ్ లు) సిబ్బంది అందరూ పాత పెన్షన్‌ స్కీముకు అర్హులని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వారికి కూడా ఓపీఎస్‌ అమలు చేయడానికి తిరస్కరించటం శోచనీయమని పేర్కొన్నారు. ఎన్.పీ.ఎస్ కు అనుకూలంగా కొద్దిమంది ఆర్థికవేత్తలు చేస్తున్న వాదనలు పూర్తిగా అసంబద్ధమన్నారు. అనేక దేశాల్లో పెన్షన్ నిధులు కుప్పకూలాయని, పెన్షనర్లు నష్టపోయారని, భారతదేశంలో కూడా ఎన్.పీ.ఎస్ మార్కెట్‌పై ఆధారపడి ఉంటుందని, షేర్ మార్కెట్ పతనమైతే పెన్షన్ ఫండ్ దివాళా తీస్తుందని గడ్డం అశోక్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ప్రజాసంపదను కార్పొరేట్లకు దోచి పెడుతూ, సామాజిక రంగానికి, వృద్ధాప్య భద్రతపై కోతలు విధిస్తున్నదని, పెన్షన్ ఫండ్లను ప్రైవేటీకరిస్తున్నదని తెలిపారు. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరించినట్లుగా కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నో పెన్షన్ స్కీమును (ఎన్.పీ.ఎస్) రద్దు చేసి ఓ.పి.ఎస్ ను అమలు పరచాలని కోరారు. పాత పెన్షన్ విధానం ఉద్యోగులకే కాకుండా దేశానికి కూడా చాలా ఉపయోగకరమన్నారు. ఎన్. పీ.ఎస్ పై కేంద్రం వేసిన కమిటీపై భ్రమలు అవసరం లేదని, వృద్ధాప్య భద్రతను కాపాడేందుకు, దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఇతర సమస్యల పరిష్కారానికై ఐక్యంగా భారత్ బంద్ తో సహా ఆందోళనలను వెంటనే తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా గడ్డం అశోక్ హెచ్చరించారు.


గడ్డం అశోక్

9490300725






26/03/2023

Center Appointed Committee for Changes in NPS(CPS )

G. Ashok

 సిపియస్ విధానంలో మార్పుల కొరకు కేంద్ర కమిటీ

హిమాచల్ ప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్ ఘర్, పంజాబ్, ఝార్ఖండ్ తదితర రాష్ట్రాలు తమ ఉద్యోగులకు ఉద్యోగ విరమణ అనంతరం  కొత్త పెన్షన్ విధానం( సిపియస్) విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని(ఓపియస్)ని పునరుద్దరించాయి. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత పెన్షన్ విధానంలో మార్పులకు కమిటీని వేసింది.

పాత పెన్షన్ విధానం అంటే ట్రిపుల్ బెనిఫిట్ స్కీం. 1. ఉద్యోగి ఉద్యోగ విరమణ చేసేనాటి బేసిక్ పే లో సగం పెన్షన్ గా చెల్లిస్తారు. ఈ పెన్షన్ కూడా వేతన సవరణ జరిగినపుడల్లా పెన్షన్ ని కూడా సవరిస్తారు. ఈ విధానంలో ఉన్న ఉద్యోగుల నుండి ఉద్యోగం చేసినంత కాలం వేతనంలో 6శాతం జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాకు జమచేసినట్లయితే దాని మీద వడ్డీతో సహా ఉద్యోగ విరమణ అనంతరం నగదుగా ఇస్తారు.  3. ఉద్యోగ విరమణ సమయంలోనే గ్రాట్యుటీ రూపంలో కొంత నగదుగా చెల్లిస్తారు. 

పాత పెన్షన్ విధానం 01.01.2004 దాకా ఉద్యోగులకు లాభసాటిగా ఉండేది. 2004లో అప్పటి బిజేపీ ప్రభుత్వం కేంద్ర ఉద్యోగుల ఈ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి 01.01.2004 తదుపరి ఉద్యోగంలో చేరే వారికి కొత్త పెన్షన్ విధనాన్ని ప్రకటించింది. ఈ కొత్త విధానం ప్రకారం ఉద్యోగులు ప్రతి నెలా తమ వేతనం లో 10శాతం కాంట్రిబ్యూట్ చేస్తే, ప్రభుత్వం కూడా 10శాతం కాంట్రిబ్యూట్ చేసి ఆ మొత్తాన్ని షేర్ మార్కెట్ లో పెట్టుబడిగా పెట్టి వచ్చిన లాభాల ద్వారా ఉద్యోగులకు పెన్షన్ ఇచ్చే విధానాన్ని తీసుకు వచ్చింది. 

కేంద్రం తమ ఉద్యోగులకు కొత్త విధానాన్ని అమలు చేయడమే కాకుండా రాష్ట్రాలు కూడా ఇదే విధానాన్ని అమలు చేయడం మంచిదని సలహా ఇచ్చింది. ఆ తరువాత దేశంలో కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న బెంగాళ్, కేరళ, త్రిపుర రాష్ట్రాలలో తప్ప అన్ని రాష్ట్రాలు కొత్త పెన్షన్ విధానాన్ని అమలు చేసాయి. కేరళ, త్రిపురలలో కూడా కమ్యూనిస్టు ప్రభుత్వాలు అధికారం కోల్పోయి ఇతర పార్టీలు అధికారం లోకి వచ్చిన తరువాత ఇదే విధానాన్ని అమలు చేసాయి. 

కొత్త పెన్షన్ విధానం ఉద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేసింది. మాకు పాత విధానంలోనే పెన్షన్ చెల్లించాలని ఆందోళనలు మొదలైనాయి. అందులో భాగంగానే హిమాచల్ ప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్ ఘర్, పంజాబ్, ఝార్ఖండ్ తదితర రాష్ట్రాలు తమ ఉద్యోగులకు ఉద్యోగ విరమణ అనంతరం  కొత్త పెన్షన్ విధానం(సిపియస్) విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని(ఓపియస్)ని పునరుద్దరించాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విదంగా నిర్ణయం తీసుకోవడంతో కేంద్రానికి గుబులు మొదలైంది. పాత విధానంలోకి పోతే పోవచ్చు గాని ఇప్పటిదాకా ఈ స్కీంలో చెల్లించిన నిధులను మాత్రం తిరిగి ఇచ్చేది లేదు అంది. రిజర్వు బ్యాంకు కూడా ఒక ప్రకటన చేస్తూ పాత విధానం అమలు చేయడం రాష్ట్రాలకు తగని పని అంటూ అలా చేయడానిక ఆర్థిక వనరులు సరిపోవని హెచ్చరించింది.  అయినా ఇటీవల మహారాష్ట్రలో కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె సందర్భంగా అక్కడి ప్రభుత్వం పాత పెన్షన్ లో మాదిరిగా ప్రయోజనాలు కలిగేవిధంగా కొత్త పెన్షన్ విధానంలో మార్పులకు ముందుకు వచ్చింది. ఉద్యోగులు తము చేసే 10శాతం కాంట్రిబ్యూషన్ కు ప్రభుత్వం ఇప్పటిదాక 14 శాతం కాంట్రిబ్యూట్ చేస్తూ వస్తున్న దానిని 20 శాతానికి పెంచుతామని  వాగ్దానం చేయాల్సి వచ్చింది. 

ఈ పూర్వరంగంలో కేంద్రం కూడా తప్పని సరి అయి ఏదోవిధంగా ఉద్యోగులను మంచి చేసుకోక తప్పదనే నిర్ణయానికి వచ్చి గతంలో ఈ కొత్త పెన్షన్ స్కీం అమలుకు ముందే ఇచ్చిన నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలలోకి వచ్చిన వారికి వచ్చే ఆగష్టు 31 లోగా ఆప్షన్ ఇచ్చి పాత పెన్షన్ విధానంలోకి వెళ్లే విధంగా వెసులు బాటు కల్పించింది. అయినా ఉద్యోగుల ఆందోళనలు తగ్గలేదు సరికదా పెరిగాయి.  ఈ పరిస్థితుల్లో  కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు గత శుక్రవారం రోజున ఆర్థిక శాఖ కార్యదర్శి టి.వి. సోమనాథన్ నేత్రుత్వంలో ఒక కమిటీని వేసింది. ఈ కమిటీ ప్రస్తుత కొత్త పెన్షన్ విధానంలో ఉద్యోగుల ఆశలు నెరవేరేలా ఎలాంటి మార్పులు చేయాలో సూచిస్తుంది.  

టివి సోమనాథన్ కమిటీ ఏం సూచనలు చేస్తుందో వేచి చూడాల్సిందే. అంతే తప్ప కేంద్రం సిపియస్ విధానాన్ని రద్దుచేసి ఓపియస్ విధానాన్ని అమలు చేయడానికి కమిటీ వేసిందని కొందరు చెబుతున్నది సరికాదు. ఇక పోతే టివి సోమనాథన్ కమిటీ కూడా చేసేది ఏమిటంటే ఆం.ప్ర. ప్రభుత్వం మాదరిగా జిపియస్ విధాన్నాన్ని ప్రతిపాదించ వచ్చు. ఏపీ ప్రభుత్వం  ప్రస్తుత సిపియస్ విధానంలోనే ఉద్యోగి చివరి నెల బేసిక్ పేలో 33శాతం పెన్షన్ ని గ్యారంటీ చేస్తాం అంది. అలాగే కాంట్రిబ్యూషన్ ని 14 శాతానికి పెంచడానికి ఒప్పుకుంటే పై 33 శాతాన్ని 40శాతానికి గ్యారంటీ చేస్తామనీ అంది. కాని, ఆ విధానాలు నచ్చక, అక్కడి ఉద్యోగులు ఆందోళన చేస్తూనే ఉన్న విషయమూ మనకు తెలిసిందే. 

కేంద్ర ప్రభుత్వం కూడా అదే మాదిరిగా ఉద్యోగుల ఆందోళనలను చల్లార్చే దాంట్లో భాగంగా మరింత ఉపశమనం ప్రకటించే అవకాశం మాత్రం ఉంది. అంతే తప్ప అసలు సిపియస్ విధానాన్ని రద్దు చేసి ఓపియస్ విధానం తెచ్చే ఆలోచన కేంద్రానికి ఉన్నట్లు లేదు. ఉద్యోగులు తమ ఆందోళనలను మరింత ఉద్రుతం చేసి తమ హక్కులు కాపాడుకోవాల్సిన బాధ్యత వారి మీదే ఉంది. 

విచారించవలసిన అసలు విషయం ఏమిటంటే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులలో , వివిధ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులలో ఉన్న ఆందోళన కూడా మన తెలంగాణ లో లేదు. బడా ఉద్యోగ సంఘ నేతలను తన చంకలో పెట్టుకున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసలు స్పందించే అవకాశం కూడా లేదు. యుఎస్ పిసి చొరవతో గత 2018లో ఏర్పడినట్లు ఏదైనా ఐక్య వేదిక ఏర్పడితే తప్ప ప్రయోజనం లేదు. మనం మేల్కోవాలి. మన మిత్రులను మేల్కొల్పాల్సిన బాధ్యత మన మీదే ఉంది.

గడ్డం అశోక్

TAPRPA St Sec.