05/07/2025

2025 జూలై 9 దేశవ్యాప్త సమ్మె డిమాండ్లు

G. Ashok

 

2025 జూలై 9 దేశవ్యాప్త సమ్మె డిమాండ్ల

1.     నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి.

2.    పని హక్కు ప్రాథమిక హక్కుగా గుర్తించాలి. సమాన పనికి - సమాన వేతనం అమలు చేయాలి. కనీస వేతనం నెలకు రూ.26,000/- లుగా నిర్ణయించాలి.

3.    ఔట్ సోర్స్, ఫిక్స్ టర్మ్ ఎంప్లాయ్ మెంట్, అప్రెంటిస్లు, ట్రైనీలు వంటి రూపాలలో వివిధ పథకాల క్రింద పనిచేస్తున్న కార్మికులు ఎవరినీ క్యాజువలైస్ చేయరాదు.

4.    ఈపిఎస్ మరియు ఇతర ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉద్యోగ విరమణ చేసిన వారందరికి కనీస పెన్షన్ నెలకు రు. 13,000లు ఇవ్వాలి. దానికి ఎప్పటికప్పుడు కరువు భత్యం జోడించాలి.  అసంఘటిత కార్మికులు మరియు వ్యవసాయ కార్మికులతో సహా అన్ని తరగతుల కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలి. పెన్షన్తో సహా సమగ్ర సామాజిక భద్రతలో అందరినీ భాగస్వాములను చేయాలి.

5.    పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలి. సిఎన్ఎస్ మరియు యుపిఎస్ ను రద్దు చేయాలి. పెన్షన్ సవరణ చట్టం 2025ని రద్దు చేయాలి.

6.    ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇప్పటికే వర్తిస్తున్న ఆరోగ్య సదుపాయాలను కుదించకుండా అవసరమైన మేరకు మెరుగ్గా చేయాలి.

7.     దరఖాస్తు పెట్టినప్పటి నుండి 45 రోజుల వ్యవధిలో కార్మిక సంఘాల తప్పనిసరి రిజిస్టర్ చేయబడాలి. ILO సమావేశాలు C87 మరియు C98 లను తక్షణమే ఆమోదించాలి.

8.    ధరల పెరుగుదలను నియంత్రించాలి. ఆహారం, మందులు, వ్యవసాయ- పనిముట్లు, ఎరువులు మరియు యంత్రాలు వంటి ముఖ్యమైన వస్తువులపై జీఎస్టీని తొలగించాలి. పెట్రోలియం ఉత్పత్తులు మరియు వంట గ్యాస్ పై సెంట్రల్ ఎక్సైజ్ పన్నును గణనీయంగా తగ్గించాలి. ఆహార భద్రత చట్టానికి హామీ ఇవ్వాలి. ప్రజా పంపిణీ వ్యవస్థను సార్వత్రికం చేయాలి.

9.    ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ విభాగాల ప్రైవేటీకరణను ఆపాలి. నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ (MP) ను వెనక్కితీసుకోవాలి.

10. అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర @C-2+50% నిర్ధారించాలి. చట్టపరమైన హామీ ఇవ్వాలి. విత్తనం, ఎరువులు మరియు విద్యుత్ మొదలైన వాటిపై రైతులకు ఇన్పుట్ సబ్సిడీని పెంచాలి.

11.  విద్యుత్ (సవరణ) బిల్లు 2022ను ఉపసంహరించుకోవాలి. విద్యుత్ ప్రైవేటీకరణను ఆపాలి. ప్రీ-పెయిడ్ స్మార్ట్ మీటర్లు పెట్టకూడదు.

12. ఉచిత విద్యా హక్కు, ఉచిత ఆరోగ్య హక్కు, నీరు మరియు అందరికీ పారిశుధ్యం అందుబాటులోకి తేవాలి. నూతన విద్యా విధానం (NEP) 2020ను రద్దు చేయాలి. అందరికీ గృహనిర్మాణం అమలు చేయాలి.

13. అటవీ హక్కుల చట్టాన్ని (FRA) కఠినంగా అమలు చేయాలి.

14. వెల్ఫేర్ ఫండ్ లోకి వచ్చిన చందా నిధులతో నిర్మాణ కార్మికులకు ESI కవరేజ్ ఇవ్వాలి. ఆరోగ్య పథకాలకు కవరేజ్, ప్రసూతి ప్రయోజనం, ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకున్న కార్మికులందరికీ జీవిత మరియు వైకల్యం బీమా ఇవ్వాలి.

15. అత్యధిక సంపన్నుల పైన, కార్పొరేట్లపైన విధిస్తున్న పన్నును పెంచాలి. సంపద పన్ను మరియు వారసత్వ పన్నును తిరిగి ప్రవేశపెట్టాలి.

16.      భావ ప్రకటనా స్వేచ్ఛ, అసమ్మతి హక్కు, మత స్వేచ్ఛ, విభిన్న సంస్కృతులు, భాషలు, చట్టం ముందు సమానత్వం మరియు దేశ సమాఖ్య నిర్మాణం మొదలైన రాజ్యాంగ ప్రాధమిక విలువలైన దాడిని ఆపాలి.

జి. అశోక్ 9490300725

04/07/2025

కార్మికులకు మరణశాసనం లేబర్‌కోడ్స్‌

G. Ashok

                                         కార్మికులకు మరణశాసనం లేబర్‌కోడ్స్‌


1991లో వచ్చిన సరళీకృత ఆర్థిక విధానాలు, కేంద్ర ప్రభుత్వ కార్మికుల వ్యతిరేక వైఖరి, ప్రయివేటీకరణ పోకడల్ని నిరసిస్తూ, కార్మిక హక్కుల్ని కాపాడటం కోసం పది కేంద్ర కార్మిక సంఘాలు నాటి నుండి నేటి వరకు దేశవ్యాప్తంగా 21 సమ్మెలు నిర్వహించాయి. ప్రధాన రంగాల ప్రయివేటీకరణ, విదేశీ పెట్టుబడి ఆహ్వానాన్ని వ్యతిరేకిస్తూ మొదటి దేశవ్యాప్త సమ్మె 29 నవంబర్‌ 1991లో మొదలైంది. కార్మికులకు అధిక వేతనాలు, సామాజిక భద్రత కల్పించడం, కార్మిక చట్టాల్లో సంస్క రణలకు వ్యతిరేకంగా జరిగిన దేశవ్యాప్త సమ్మెల్లో కార్మికులు ప్రతియేటా పాల్గొంటు న్నారు.


అంతేకాక ఉద్యోగ భద్రత, పెన్షన్‌ హక్కును డిమాండ్‌ చేస్తూ కార్మికులు సమ్మెలు నిర్వహిస్తున్నారు. 2020 నవంబర్‌ 26న జరిగిన దేశవ్యాప్త సమ్మెలో 25 కోట్ల మంది అనగా 250 మిలియన్ల కార్మికులు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సమ్మె ద్వారా తమ నిరసన తెలియజేశారు. ఇది ప్రపంచంలో జరిగిన అతిపెద్ద సమ్మెల్లో ఒకటని జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలు అభివర్ణించాయి. 2019 జనవరి 8-9 తేదీల్లో జరిగిన రెండు రోజుల సమ్మె, 2022 మార్చి 28-29 తేదీల్లో జరిగిన సమ్మెలు, బ్యాంకింగ్‌, రవాణా, ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రభావితం చేశాయి. కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక కార్మికుల హక్కుల కోసం పోరాడే శక్తివంతమైన వేదికగా నిలుస్తున్నది. జులై 9న నిర్వహించే దేశవ్యాప్త సమ్మె కూడా అందులో భాగం కానుంది.



ప్రస్తుతం మోడీ నేతత్వంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులను బానిసత్వంలోకి నెట్టి వేసే లక్ష్యంతో 29 కార్మిక చట్టాల్ని రద్దు చేసి, వాటిస్థానంలో నాలుగు లేబర్‌ కోడ్స్‌ను అమలు చేసేందుకు అడుగులు వేస్తున్నది. ఫ్యాక్టరీల్లో, పని ప్రదేశంలో యూనియన్లు లేకుండా చేయటమే లక్ష్యంగా, కార్మికవర్గాన్ని నిరాయుధుల్ని చేయడమే ధ్యేయంగా ఈ లేబర్‌ కోడ్స్‌ అని స్పష్టమవుతున్నది. 2002లో అప్పటి వాజ్‌పారు ప్రభుత్వం 2వ లేబర్‌ కమిషన్‌ను రవీంద్రవర్మ నేతృత్వంలో నియమించి 44 కార్మిక చట్టాల స్థానంలో లేబర్‌ కోడ్స్‌ను తీసుకురావాలని ప్రతిపాదించింది. ప్రస్తుత మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక, చట్టవిరుద్ధ విధానాలు దాదాపు అన్ని కూడా 2వ లేబర్‌ కమిషన్‌ సిఫార్సులను పోలి ఉండటాన్ని గమనిస్తే అప్పటినుండి యజమానులకు అనుకూలంగా, కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాయ పూనుకున్నదన్న విషయం అవగతమవుతున్నది.


2005లో అప్పటి యూపీఏ ప్రభుత్వానికి వామపక్ష పార్టీల సహకారం ఉండటం వల్లన లేబర్‌కోడ్స్‌ను తీసుకురావడానికి వెనుకడుగు వేసింది. 2014లో తిరిగి అధికారంలోకి వచ్చిన బీజేపీ నాలుగు లేబర్‌ కోడ్స్‌ను తీసుకొచ్చి వాటి ప్రక్రియను ప్రారంభించింది. కార్మిక సంఘాల సమ్మెలు, పోరాటాల వలన వెంటనే అమలు చేయడానికి ప్రభుత్వానికి సాధ్యం కాలేదు. 2019లో మూడోసారి అధి కారం చేపట్టిన తర్వాత పార్లమెంట్‌లో వేతనాల కోడ్‌ను పాస్‌ చేయించుకుంది. 2020లో మిగిలిన మూడు పారిశ్రామిక సంబం ధాల కోడ్‌, సామాజిక భద్రత కోడ్‌, వత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్స్‌ను ఆమోదించుకుంది. మూడు వ్యవ సాయ నల్లచట్టాలు పార్లమెంటులో ప్రవేశపెట్టగా అప్పటి ప్రతిపక్ష పార్టీల పార్లమెంట్‌ సభ్యులు వాటికి నిరసనగా వాకౌట్‌ చేసిన సమయంలో ఈ లేబర్‌ కోడ్స్‌ను దొడ్దిదారిలో ఆమోదింపజేసుకుంది.



ఈ లేబర్‌కోడ్స్‌ను సరిగ్గా పరిశీలిస్తే కార్మిక వర్గంపై ప్రత్యక్ష దాడిచేసి వారి హక్కుల్ని హరించేందుకు ఉద్దేశించిన విధంగా ఇవి రూపొందించబడ్డాయి. దేశ సహజ వనరులను, ప్రజలను దోచుకోవడానికి, కార్పొరేట్‌ యాజమా న్యాలకు లాభాలు కట్టబెట్టడానికి, కార్మికులను మరింత దోపిడీ చేసేలా ఉన్నాయి. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన కార్మికులు, సంఘాలు కార్మికులతో కలిసి నిరంతర పోరాటాలు, ఆందోళనలు, ప్రతిఘటనలు చేయడం వల్ల ఈ నాలుగేండ్ల నుంచి ఈ లేబర్‌కోడ్స్‌ని అమలు చేయటంలో కేంద్రం కాస్తా వెనుక్కు తగ్గింది. అయితే 2025లో ఈ లేబర్‌ కోడ్స్‌ను ఎలాగైనా అమలు చేయలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. ఇప్పటికే మోడీ ప్రభుత్వం ”జన విశ్వాస్‌” అనే చట్టంలోని నిబంధనల ప్రకారం అనేక చట్టాల కింద కార్పొరేట్లకు సంబంధించి 180 నేరాలను నేరరహితం చేసింది. ఈ చట్టాలను ఉల్లంఘించినందుకు యజమానులకు జైలు శిక్షలు విధించే నిబంధనలను ఈ లేబర్‌ కోడ్స్‌లో ఉపసంహరించింది. 2025 కేంద్ర బడ్జెట్‌లో కూడా మరో 100 నేరాలను నేర రహితం చేసింది. ”శ్రమ సమాధాన్‌”, ”శ్రమ సువిధ పోర్టల్‌”లు యజమానులు కార్మిక చట్ట ఉల్లంఘనలను సులభతరం చేయడానికి, ఫిర్యాదు ఆధారిత తనిఖీలను ఈ లేబర్‌ కోడ్స్‌ ద్వారా రద్దు చేసింది.



మరోవైపు కార్మికులు పోరాడి సంపాదించు కున్న హక్కులను కాలరాస్తూ సమిష్టి బేరసారాల చర్యలను లేబర్‌కోడ్స్‌ తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నది. కార్మికులు వారి సంఘాలు సమిష్టిగా ఫిర్యాదు చేయడం లాంటి వాటిని వ్యవస్థీకృత నేరంగా పరిగణించాలని పేర్కొంటు న్నది. ఫలితంగా నాన్‌ బెయిలబుల్‌ శిక్షలతో సహా పోలీసు చర్యలకు దారి తీసే ప్రమాదం కూడా ఉంది. ఈ లేబర్‌ కోడ్స్‌ అమలు చేయడానికి ముందుగానే గేట్‌ మీటింగులు, డిపార్ట్‌మెంటల్‌ సమావేశాలు, కరపత్రాల పంపిణీ, మెమొరాం డాలు అందజేయటం లాంటి ట్రేడ్‌ యూనియన్‌ కార్యకలాపాలను, హక్కులను ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో, సంస్థల్లో ఇప్పటికే నిషేధించింది. ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ఉపాధిని తీసుకురావడం ద్వారా ఉద్యోగ భద్రతతో పాటు అనేక సౌకర్యాలు అందచేయకుండా చూడటమే దీని ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తున్నది. శాశ్వత ఉద్యోగి, ఉపాధి అనేది ఒకప్పటి విషయం.


ప్రస్తుతం ఔట్‌సోర్సింగ్‌, అప్రెంటీస్‌లు, ఇంటర్న్‌షిప్‌లు మొదలైన విధానాల ద్వారా కార్మికులను కేంద్రం నియమిస్తున్నది. అంతేకాక ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ, గ్రాట్యూటీ సౌకర్యాలను కూడా కార్మికులకు దూరం చేసే రూల్స్‌ను ఈ లేబర్‌కోడ్స్‌లో పొందుపరిచింది. ఇది ట్రేడ్‌ యూనియన్‌లను బలహీనపరచడానికి, యూనియన్లను తొలగించడానికే అనేది స్పష్టమవుతున్నది.దీనిద్వారా కార్మికుల్లో ఒక భయానక వాతావరణాన్ని సష్టించే పథకం చాపకింద నీరులా మోడీ సర్కార్‌ అనుసరిస్తున్నది.

లేబర్‌ కోడ్స్‌ అమలు అంటే మొత్తం పరిపాలనలో కార్పొరేట్‌ పెట్టుబడిదారీ వర్గం విధానాల అమలుకు ఎలాంటి అడ్డం కులు లేకుండా కొనసాగించుకోవడానికి, యథేచ్ఛగా లాభాలు ఆర్జించటానికేనన్నది స్పష్టమవుతున్నది. యూనియన్ల రహిత పని ప్రదేశాల ఏర్పాటు, కార్మికుల సమిష్టి చర్యలను నిర్వీర్యం చేసి వారిని నిరాయుధులను చేయడమే ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తున్నది.



కార్మికుల హక్కుల్ని కాలరాసే మరణ శాసనాలుగా ఈ లేబర్‌కోడ్స్‌ పనిచేయ నున్నవి. అందుకే ఈనెల 9న జరగబోయే దేశవ్యాప్త సమ్మెను గతంలో నిర్వహించిన సమ్మెల్లో ఒకటిగా చూడకూడదు. లేబర్‌ కోడ్స్‌ అమలును తీవ్రంగా తిప్పికొట్టడానికి ప్రతిఘటనా, పోరాటాల ప్రారం భంగా ఈ సమ్మెను చూడాలి. పెట్టుబడి దారీ విధానాన్ని తరిమేయడంలో కార్మిక వర్గం మరింత మెలకువతో ముందుండాలి. నయా ఉదార వాదానికి వ్యతిరేకంగా, ఐక్యపోరాటాలను మరింత ఉన్నతస్థాయికి తీసుకుని వెళ్లాలి. ఈ సమ్మె రెండవ దశ పోరాటానికి ప్రారంభం మాత్రమేనని దేశ ప్రజానీకానికి తెలియజేయాలి.



****

ఎస్‌ఎస్‌ఆర్‌ఎ ప్రసాద్‌ 9490300867


16/01/2025

ఇంటర్ విద్యలో సంస్కరణల అవసరం..

G. Ashok

 

ఇంటర్ విద్యలో సంస్కరణల అవసరం..


                        

ఇంటర్ విద్యలో సంస్కరణల అవసరం



        జాతీయ క్రైమ్ బ్యురో లెక్కల ప్రకారం భారతదేశంలో విద్యార్థుల ఆత్మహత్యల్లో 9శాతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. వీటిలో మెజారిటీ విద్యార్థులు ఇంటర్మీడియట్ చదువుతున్నావారే కావడం గమనార్హం. నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డులు 2022 ప్రకారం విద్యార్థుల ఆత్మహత్యల్లో మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్ తొలి మూడు స్థానాల్లో ఉండగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వరుసగా 10, 11వ స్థానాల్లో ఉన్నాయి.

             తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు అధికశాతం మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఇంటర్మీడియట్ విద్యారంగం కార్పొరేట్ శక్తుల కబంధహస్తాల్లో ఉండడమే. వారి ప్రభావం మూలంగా గత మూడు దశాబ్దాలలో ఇంటర్మీడియట్ విద్యలో ఎటువంటి సంస్కరణలు జరగలేదు. కార్పొరేట్ శక్తుల స్వార్థ ప్రయోజనాలకోసం పోటీ ప్రపంచంలో తామంలే తాము ముందున్నామని ప్రజలను నమ్మించడం కోసం విద్యార్థులను మానసికంగా ఒత్తిడికి గురి చేస్తున్నారు. 

విద్యలో మౌలిక వ్యత్యాసాలు

            తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి వరకు నిరంతర సమగ్ర మూల్యాంకనం (CCE) విధానం, ఆంధ్రప్రదేశ్ లో సిబిఎస్ఈ పరీక్షల విధానం అమలులో ఉన్నాయి. పదో తరగతి సిలబస్, ఇంటర్ మీడియట్ సిలబస్ మధ్య చాలా వైవిధ్యత ఉంటుంది. పదో తరగతి బోర్టు పరీక్షలలో ప్రశ్నీ పత్రం విధానానికీ, ఇంటర్మీడియట్ పరీక్ష పత్రం విధానానికి కూడా మౌళికంగా చాలా తేడాలు ఉన్నవి. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాలు ఆగష్టులో పూర్తి అవుతాయి. పరీక్షలు మార్చి మొదటి వారంలో ఉంటాయి. విద్యార్థి కేవలం 6 నెలల్లో పరీక్షలకు సిద్దం అయి బోర్డు పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది.

మొదటి సంవత్సరం విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి

      కొన్ని సందర్భాలలో విద్యార్థులు మొదటగా ఒక గ్రూపు ఎంపిక చేసుకుని, తరువాత వివిధ కారణాల వలన వేరే గ్రూపుకు మారుతుంటారు. అలాంటి విద్యార్థులకు మరింత తక్కువ సమయమే దొరుకుతుంది. ఈ విధంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులు చాలా ఒత్తిడితో పరీక్షలకు హాజరు అవుతున్నారు. దీని ప్రభావంతో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఉత్తీర్ణతా శాతం తక్కువగా ఉంటుంది. అలాంటి విద్యార్తులు ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరంలో గతంలో ఫెయిల్ అయిన సబ్జెక్టులూ, రెండవ సంవత్సరం సబ్జెక్టులు కలిపి పరీక్షలకు ఒకేసారి హాజరు కావడం వల్ల రెండింటిలోనూ ఉత్తీర్ణత సాధించలేకపోతున్నారు. రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఆత్మహత్యలకు గురి అవుతున్న విద్యార్థులలో అత్యధిక శాతం ఇంటర్మీడియట్ విద్యార్థులే అని గణాంకాలు చెబుతున్నాయి. ఇంటర్ ఫలితాలు వెలువడిన ప్రతిసీరి విద్యార్థుల ఆత్మహత్యల వార్తలు ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి. ఇంటర్మీడియట్ లో చేరే విద్యార్థులు కోర్సు మొదలయిన రోజునుండి ఫలితాలు వచ్చేవరకు రెండు సంవత్సరాలపాటు నిరంతర ఒత్తిడిలో ఉంటారు. దీనికి కారణం బోర్డు పరీక్షలు, కార్పొరేట్ శక్తుల మరియు తల్లిదండ్రుల ఒత్తిడి.

మొదటి సంవత్పరం పరీక్ష తొలగింపే మంచిది

    దేశంలో కేవలం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో, తమిళనాడులో మాత్రమే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం బోర్డు పరీక్షలు జరుగుతున్నాయి. మిగతా రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో కేవలం అంతర్గత మూల్యాంకనం ద్వారా మాత్రమే విద్యార్థి అభ్యసన సామర్థ్యాలను నమోదు చేస్తున్నారు. ఇంటర్మీడిట్ మొదటి సంవత్సరం పరీక్షల్ని తొలగిస్తే విద్యార్థులపై ఒత్తిడి తగ్గి మొదటి ఏడాది సిలబస్ లో కీలక అంశాలపై పట్టు సాధించడంతోపాటు వాటి ఆధారంగా రెండో ఏడాది సబ్జెక్టులపై పట్టు సాధించడంతో పాటు జాతీయ స్థాయి పరీక్షలలో రాణించే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కూడా పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యే సమయం, సౌలభ్యం దొరుకుతుంది. అధ్యాపకులు కూడా పోటీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేసేందుకు వెసులు బాటు ఉంటుంది. అదేవిధంగా జాతీయ బోర్డు మరియు ఇతర రాష్ట్రాల బోర్డులు కేవలం 12వ తరగతి పరీక్షలు మాత్రమే నిర్వహిస్తున్నందున వారితో సారూప్యత ఏర్పడుతుంది. ఇక్కడ ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు తొలగిస్తే విద్యార్థులు, అధ్యాపకులలో మొదటి సంవత్సరంపై శ్రద్ధ తగ్గి కేవటం రెండవ సంవత్సరంలపై మాత్రమే ద్రుష్టి పెడతారని కొందరు విద్యావేత్తల అభిప్రాయం. మొదటి సంవత్సరం ఇంటర్నల్ పరీక్షలు, మూల్యాంకనం పకడ్బంధీగా నిర్వహించడం ద్వారా దీనిని అధిగమించవచ్చు.

అభ్యసన సామర్థ్యాల మెరుగుదల అప్పుడే

  విద్యార్థులపై మానసిక ఒత్తిడి తగ్గడం ద్వారా వారి అభ్యసన సామర్థ్యాలు మెరుగుపరగాయని పరిశోధనల ద్వారా రుజువయింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో బోర్డు పరీక్షలను రద్దుచేసి అంతర్గత మూల్యాంకనం ద్వారా విద్యార్థుల అభ్యసన స్థాయిని నమోదు చేస్తే మానసిక ఒత్తిడి తగ్గి, జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో మాదిరిగా మన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు కూడా భయరహితంగా పరీక్షలు సిద్ధం అవుతారు. విద్యార్థుల ఆత్మహత్యలు తగ్గే అవకాశం ఉంది. పోటీ పరీక్ష మాయజాలంలో పడి మధ్యతరగతి తల్లిదండ్రులు వారి ఆర్థిక స్థోమత కన్నా ఎక్కువగా అప్పులు చేసి వారి పిల్లలను కార్పొరేట్ కళాశాలలో చదివిస్తున్నారు. పిల్లలపై ఒత్తిడి పెరగడానికి అలా తల్లిదండ్రలు కూడా కారణమవుతున్నారు.

ప్రభుత్వ కోచింగ్ సెంటర్లు ఆవశ్యకత

    ప్రభుత్వమే ఇంటర్మీడియట్ తరువాత విద్యార్థులు రాసే పోటీ పరీక్షల కోసం ప్రత్యేకంగా కోచింగ్ కేంద్రాలను నిర్వహించడం ప్రభుత్వ రంగంలో ఇంటర్మీడియట్ విద్య బలోపేతానికి చర్యలు తీసుకోవడం, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేయడం వంటి చర్యలు తీసుకోవాలి. ఇంటర్మీడియట్ విద్యలో అలాంటి సంస్కరణలు చేయాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర పరీక్షలను రద్దు అంశంపై ప్రతిపాదనలు చేయడం ద్వారా చర్యలు ప్రారంభించిందని చెప్పవచ్చు. తెలుగు రాష్ట్రాలు సంస్కరణలు చేయడం ద్వారా విద్యార్థులపై ఒత్తిడి తగ్గిస్తాయని ఆత్మహత్యలు నివారించడానికి క్రుషి చేస్తాయని ఆశిద్దాం.


Dr. A. Venu Gopala Reddy

Pakala Sankar Goud